ఏపీఐఐసీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి ఇచ్చేసింది. రిలయన్స్ సంస్థ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. భూముల కోసం సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
ఫలించని సంప్రదింపులు
రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం 136 ఎకరాలను కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది. రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఇలా సమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉండదు. ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని ఓ అధికారి తెలిపారు. ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించింది.
‘సెట్‌టాప్ బాక్సుల అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్ సంస్థ విరమించింది. సంస్థ అవసరాల మేరకు సెట్‌టాప్ బాక్సుల తయారీకి ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అధికారులు జరిపిన సంప్రదింపుల్లో వెల్లడించింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'