ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో బర్డ్ ఆస్పత్రిలోని చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు.
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా, వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా వారిని నిర్బంధించినట్లు సమాచారం.
ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో నగరంలో స్వల్ప ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. సోమవారం నుంచి మంగళవారం వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.45 గంటల వరకు ఘాట్ రోడ్లలో ఎలాంటి వాహనాలను అనుమతించబోమన్నారు.
గురుడ సేవలో పాల్గొననున్న జగన్..
నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవలో పాల్గొననున్న సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముందుగా తితిదే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరికి చేరుకొని శ్రీవారి పాదాల వద్ద భక్తుల విరాళాలతో నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునికీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.
తిరుపతిలో పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ తర్వాత తిరుమల చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గరుడవాహన సేవలో పాల్గొంటారు. తర్వాత పద్మావతి వసతి గృహానికి చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. మంగళవారం తిరిగి వేంకటేశ్వరుని సేవలో పాల్గొననున్న సీఎం ..ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్‌ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తారు. ఆలయ సమీపంలో నిర్మించిన లడ్డు బూందీ పోటునూ ప్రారంభిస్తారు.
పలు ప్రారంభోత్సవాల అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో రైతు సాధికార సంస్ధ, తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పద్మావతి అతిథి గృహానికి చేరుకొని ...మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమరావతి తిరిగి పయనమవుతారు.
ఇదీ చదవండి
నేడు తిరుమలకు సీఎం జగన్.. స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ..