Heavy Rush to Tirumala: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. తితిదే సర్వ దర్శన క్యూలైన్లలో కొన్ని మార్పులు చేసింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు గుండా నారాయణ గిరి షెడ్లలోకి భక్తులు ప్రవేశించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు, నారాయణ గిరి షెడ్లల్లో భక్తులు నిండితే ఏటిసి, ఎస్.ఎం.సి, లేపాక్షి, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, ఇల వెంకమాంబ అన్న సత్రాల వరకు క్యూ లైన్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం తితిదే చేయించేది. ఇప్పుడు సర్వ దర్శన భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులను వైకుంఠ కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లలో సైతం భక్తులు నిండిపోయారు.
పెరటాసి మాసంలో రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే భావించినా.. తితిదే అధికారుల అంచనాలకు మించి భక్తులు పోటెత్తుతున్నారు. ఓ వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం, దసరా సెలవులు ఉండటంతో తితిదే యంత్రాంగం ముందుస్తు ఏర్పాట్లను చేసింది. క్యూ లైన్ల వద్ద స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడకుండా అల్పాహారం, నీరు, పాలు పంపిణీ చేస్తున్నారు. క్యూలైన్లను తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.
తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది.. వరుస సెలవులు, పెరటాసి మాసం మూడో వారం కావడంతో భక్తులు పోటెత్తారు.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. సర్వ దర్శనానికి రెండు రోజుల సమయం పడుతుంది.. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల యాత్ర చేయాలి -ధర్మారెడ్డి, తితిదే ఈవో
తమిళుల పవిత్రమైన మాసం ఇంకా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది.. భక్తుల రద్దీ దృష్ట్యా తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే యంత్రాంగం సిద్ధమైంది.
ఇవీ చదవండి: