నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే కాక ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి అంతరాయం ఏర్పడింది. తాజాగా తిరుపతి-చెన్నై వెళ్లే రైల్వే వంతెన ధ్వంసం కావడంతో చెన్నైకి వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు.
తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షం కాస్త తగ్గినా.. నగర వీధులన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన ముత్యాలరెడ్డిపల్లె, వైకుంఠపురం మీదుగా వర్షపు నీరు నగరంలోని చేరుతోంది. శివారు ప్రాంతాల్లోని పేరూరు చెరువు, కల్యాణి డ్యాం నుంచి పెద్దఎత్తున వర్షపు నీరు నగరంలోకి వస్తోంది. తిరుపతిలోని అనేక కాలనీలు జలమయమయ్యయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తాగునీటికీ కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా లేదు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతంలో సుమారు 500 కుటుంబాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇందులో 200 కుటుంబాలు బయటికి అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇక్కడ పర్యటించి.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు.. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం అందించారు. మరికొన్ని చోట్ల బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని గాజులమన్యంలో వరద నీటిలో చిక్కుకున్న 69మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి.
పరిస్థితిని పర్యవేక్షించిన ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న
తిరుపతిలో వరద పరిస్థితిని పర్యవేక్షించిన ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న.. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 2 వేల మందికి ఆశ్రయం కల్పించారు
కనుమదారిని పరిశీలించిన ఈవో జవహర్ రెడ్డి
తిరుమల(tirumala) కనుమదారిని ఈవో జవహర్ రెడ్డి(ttd eo jawahar reddy) పరిశీలించారు. అక్కగార్ల గుడి వద్ద కుంగిపోయిన రహదారిని ఇంజనీరింగ్, భద్రతా సిబ్బందితో కలసి తనిఖీ చేశారు. మొదటి ఘాట్ రోడ్డులోని అవ్వాచారికోన వద్ద నడక దారి భక్తుల కోసం ఏర్పాటు చేసిన వంతెన ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ మార్గంలో వాహనాలను అనుమతిస్తే పాదచారుల వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రెండవ కనుమదారిలో 18 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో.. వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
నిలిచిన రాకపోకలు..
కుప్పం మండలం వీరప్పనాయన చెరువు(veerappanayana pond) నుంచి వరద ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. కుప్పం-మల్లానూరు ప్రధాన మార్గంలో రహదారిపై వర్షపు నిలిచింది. పెద్దబంగారునత్తం కల్వర్టు నిండి రహదారిపై నీరు ప్రవహిస్తోంది. రెవెన్యూ, పోలీసు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పుంగనూరులో చౌడేపల్లి, దోబీ కాలనీలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. పుంగనూరులో 150 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఏర్పేడు మండలంలో పాపాగ్ని నది(Papagni River) ఉద్ధృతితో వంద గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. చిత్తూరు నుంచి కర్ణాటకకు రాకపోకలు నిలిచాయి.
తిరుపతిలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు. ముత్యాలరెడ్డిపల్లి, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ముంపు ఎక్కువగా ఉండడంతో 500 పైగా కుటుంబాలు నీటమునిగాయి. నగరపాలక సంస్థ అధికారులు ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన వారికి సహాయం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
మదనపల్లె ముంచెత్తిన వరద నీరు:
మదనపల్లెను వరద నీరు ముంచెత్తింది. నదులు, కాలువలు స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. పట్టణం మధ్య నుంచి వెళ్లే బహుదా నది ఉగ్రరూపం దాల్చింది. బుగ్గకాలువలోనూ నీటి ఉద్ధృతి పెరిగింది. మదనపల్లె సమీపంలో వరి, టమోటా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మదనపల్లె పరిధిలో 550 ఎకరాల వరి పంట ధ్వంసమైంది. పీలేరు నియోజకవర్గంలోని పించా, బహుదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతి-మదనపల్లె మార్గంలో కలికిరి పెద్ద చెరువు పొంగి ప్రవహిస్తోంది. తిరుపతి నుంచి మదనపల్లె వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని.. దారి మళ్లించారు. పెద్దచెరువు వరద తాకిడికి ఓ ఇల్లు కూలింది.
నిండుకుండలా కళ్యాణి జలాశయం
చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం(kalyani dam) గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రవాహ ధాటికి సమీపంలోని 11 కేవీ విద్యుత్ స్తంభం నేలకొరిగి కల్యాణి డ్యామ్‌కు విద్యుత్ సరఫరా నిలిచింది. చంద్రగిరి మండలంలో స్వర్ణముఖి నది ఉగ్రరూపానికి.. కొన్ని గ్రామాలకు వెళ్లే దారులు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు నరసింగాపురం-చంద్రగిరి మార్గంలోని వంతెన ఒకవైపు భాగం కుప్పకూలింది. 8 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. ఏర్పేడు మండలంలోని నదీపరీవాహక ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. మునగాలపాలెం, కొత్త వీరాపురం, చెన్నంపల్లితో పాటు పరిసర గ్రామాలన్నీ వరదలో చిక్కుకున్నాయి. కాళంగి రిజర్వాయర్ నుంచి వరద నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహించి.. జయలక్ష్మీపురం జలదిగ్బంధమైంది. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు సమీప గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. రాయలచెరువుపేట, బాదురుపేట, చిటత్తూరు, కాలేపల్లి తదితర గ్రామాల్లోకి నీరు చేరింది. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలోని రామసేతు, భక్త కన్నప్ప వంతెనల్ని తాకుతూ వరద ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నది ఉద్ధృతికి.. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట-గుడుమల్లం ప్రధాన రహదారిపై కాజ్‌వే కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సురక్షిత ప్రాంతాలకు బాధితులు..
తిరుపతి గ్రామీణ మండలంలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో గల్లంతైన ఐదుగురు ముళ్లపూడి(five people trapped in swarnamukhi river at mullapudi) వాసులను గ్రామస్థులు రక్షించారు. చిగురువాడ వద్ద వంతెన(chiguruvada) కూలింది. ఈ ఘటనలో శివాలయం కూడా దెబ్బతింది.
వరదనీటిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(SRI PADMAVATI MAHILA VISVAVIDYALAYAM) వరదనీటిలో చిక్కుకుంది. విశ్వవిద్యాలయానికి అనుకుని ఉన్న పేరూరు చెరువు నిండి అదనపు నీరంతా నగరంలోకి ప్రవేశిస్తుంది. తితిదే గోశాలకు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్యలో ఉన్న ప్రహరీ గోడ కూలడంతో ఒక్కసారిగా పెద్ద పెద్ద ఎత్తున వర్షపు నీరు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రవేశించింది. విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో తరగతి గదుల్లోకి వరద నీరు ప్రవేశించింది. సెరికల్చర్ విభాగం పూర్తిగా నీట మునిగింది. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులతో పాటు ఇళ్లకు వెళ్లలేని విద్యార్థులకు కూడా అక్కడే భోజనం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు.. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దువ్వూరు జమున తెలిపారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహిళా విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంప్రదించినట్లు ఆమె వివరించారు.
తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ వద్ద వంతెన కూలి రాకపోకలు స్తంభించాయి. సమీపంలోని శివాలయం నీటమునిగింది. తిరుచానూరు వసుంధర నగర్‌లో భవనం నేలకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రాకపోకలకు అంతరాయం
పుత్తూరు సమీపంలో తిరుపతి-చెన్నై రైల్వే వంతెన కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెన్నై వెళ్లే సర్వీసుల్ని రద్దు చేశారు. పుత్తూరు పరిధి భవాని నగర్, పిళ్లారిపట్టు, కామరాజనగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస అవసరాలకూ బయటికి వెళ్లలేని స్థితి నెలకొంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వంతెన కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్యవేడు నియోజకవర్గంలో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల్లో.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే రహదారులు వరద నీటి ప్రవాహంలో ధ్వంసమయ్యాయి.
పూర్తిగా ధ్వంసమైన శ్రీవారి నడకమార్గం
తిరుమలకు వెళ్లే శ్రీవారి నడకమార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరదపోటుతో.. మార్గం పూర్తిగా కొట్టుకుపోయింది. కొండపైనుంచి కొట్టుకువచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. తిరుగిరుల్లోని జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి కిందికి వరద ఉద్ధృతంగా వస్తోంది. కొండపైన అన్ని మార్గాలూ నీట మునిగాయి. వానలతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
ఇవీచదవండి