వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే కాక ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి అంతరాయం ఏర్పడింది. తాజాగా తిరుపతి-చెన్నై వెళ్లే రైల్వే వంతెన ధ్వంసం కావడంతో చెన్నైకి వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు.
తిరుపతిలో కుండపోత...
తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షం కాస్త తగ్గినా.. నగర వీధులన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన ముత్యాలరెడ్డిపల్లె, వైకుంఠపురం మీదుగా వర్షపు నీరు నగరంలోని చేరుతోంది. శివారు ప్రాంతాల్లోని పేరూరు చెరువు, కల్యాణి డ్యాం నుంచి పెద్దఎత్తున వర్షపు నీరు నగరంలోకి వస్తోంది. తిరుపతిలోని అనేక కాలనీలు జలమయమయ్యయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తాగునీటికీ కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా లేదు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతంలో సుమారు 500 కుటుంబాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇందులో 200 కుటుంబాలు బయటికి అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇక్కడ పర్యటించి.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులు.. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం అందించారు. మరికొన్ని చోట్ల బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని గాజులమన్యంలో వరద నీటిలో చిక్కుకున్న 69మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి.
పూర్తిగా ధ్వంసమైన శ్రీవారి నడకమార్గం
తిరుమలకు వెళ్లే శ్రీవారి నడకమార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరదపోటుతో.. మార్గం పూర్తిగా కొట్టుకుపోయింది. కొండపైనుంచి కొట్టుకువచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదతో మార్గమంతా నిండిపోయింది. తిరుగిరుల్లోని జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి కిందికి వరద ఉద్ధృతంగా వస్తోంది. కొండపైన అన్ని మార్గాలూ నీట మునిగాయి. వానలతో యాత్రికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
వేల ఎకరాల్లో నీట మునిగిన పంట...
చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పట్టణానికి సమీపంలో బాహుదా కాలువకు గండి పడి పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు ధ్వంసం అయ్యాయి. గ్రామీణ మండలం చీపిరి వద్ద ఉన్న వేసవి జలాశయం నుంచి భారీగా వరద నీరు రావడంతో కింది భాగాన ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి మదనపల్లి వ్యవసాయ శాఖ పరిధిలో 550 ఎకరాలు వరి ధ్వంసమైన ఆ శాఖ అధికారులు చెప్పారు.
ఇవీచదవండి.