చెన్నైకి చెందిన సరోజ సూర్యనారాయణన్ అనే భక్తురాలు తిరుమల శ్రీవారికి స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారాన్ని కానుకగా అందించారు. గురువారం సాయంత్రం ఆలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు ఉంటుంది. దీంతో పాటు దాతలు చెన్నైలో తమకు చెందిన రూ.3.50 కోట్లు విలువైన స్థలాన్ని తితిదేకు అందించేందుకు సిద్ధపడ్డారు. అయితే స్థలాన్ని తితిదే రెవెన్యూశాఖ అధికారులు తనిఖీ చేసిన అనంతరం అధికారికంగా తీసుకుంటామని భక్తురాలికి తెలిపారు.



