శ్రామికులు, కష్టజీవుల తరపున పోరాటం చేసే వామపక్షాలు కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ సేవా దృక్పథాన్ని బలంగా చాటుతున్నాయి. తిరుపతిలో సీపీఐ ఆధ్వర్యాన పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని బైరాగపట్టెడలో ఉన్న సీపీఐ కార్యాలయంలో కొవిడ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటుచేశారు. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరాలనుకునే వారికి పడకల సమాచారం అందించడం దగ్గర నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు.
తమను సంప్రదించిన వారి ఆరోగ్య పరిస్థితులను వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కరోనా కష్టకాలంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఉచితంగా మందులు, పీపీఈ కిట్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
నిత్యం అన్నదానం
కొవిడ్ సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారి ఆకలి తీర్చేందుకు సీపీఐ నాయకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల రూపంలో సమాచారాన్ని చేరవేస్తూ తమను సంప్రదించిన వారికి 14 రోజుల పాటు ఇంటివద్దకే మూడు పూటలా ఆహారం సరఫరా చేస్తున్నారు. ఉదయం టిఫిన్‌తో పాటు, మధ్యాహ్నం, రాత్రికి భోజనాన్ని సకాలంలో చేరవేస్తున్నారు. పంపిణీ చేసే ఆహారంలో పౌష్టిక పదార్థాలైన కోడిగుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా ఆసుపత్రుల వద్ద రోగుల కోసం వచ్చే బంధువులు, వారి కుటుంబసభ్యుల ఆకలి తీర్చేలా... రుయా, స్విమ్స్ ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హోం ఐసోలేషన్ కోసం రోజుకు 40 నుంచి 50 మందికి, ఆసుపత్రుల వద్ద 300 నుంచి 350 మందికి ఆహారం అందిస్తున్నారు. తిరుపతిలోనే ఉంటున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ... స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.
తమ కార్యక్రమాలకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోందని నారాయణ చెబుతున్నారు. ప్రస్తుత సమయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరికి తోచిన మేర వారు ముందుకొచ్చి సాయం చేయాలని నారాయణ పిలుపునిస్తున్నారు.
ఇదీ చదవండి: