Condition of rural roads in joint Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి తమ జిల్లాకు చెందినవారైనా.. రహదారులు బాగుపడటం లేదని ప్రజలు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతమైన పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి నియోజకవర్గాలు, తిరుపతి జిల్లా చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రాంత రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న.. చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని రోడ్లు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గుంతలు పడిన రహదారుల్లో ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నామంటూ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 6713.62 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో తారు రోడ్లు 2250 వేల కిలోమీటర్లు, సిమెంట్ రోడ్లు 363 కిలోమీటర్ల మేర ఉన్నాయి. మిగిలిన 3626 కిలోమీటర్లు మట్టి రోడ్లే. అన్ని రకాల రోడ్లపై గుంతలు పడి ధ్వంసమైనా.. అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చినుకు పడినా.. గుంతల్లో నీరు చేరి బురదమయమవుతున్నాయి. ఈ బురదలో ప్రయాణాలు చేయలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం లేనపుడు ఎగసిపడే దుమ్ముతో మరిన్ని అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాలు ఇదే రోడ్లపై పెద్ద సంఖ్యలో తిరుగుతుండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోందని వాపోతున్నారు.
రహదారుల పరిస్థితి ఇలా ఉంటే వంతెనలు మరింత దుస్థితిలో ఉన్నాయి. వర్షాలు, వరద తాకిడితో కొట్టుకుపోయిన వంతెన స్థానంలో తాత్కాలికంగా మట్టి వేసి రాకపోకలు పునరుద్ధరించిన అధికారులు.. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో వర్షాకాలంలో తమ పరిస్థితి ఏంటన్న అభిప్రాయం గ్రామీణ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: