తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.
రుయా ఘటన హృదయాన్ని కలిచివేసింది: హోంమంత్రి
తిరుపతి రుయా ఘటనపై హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందటం హృదయాన్ని కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై చర్యలకు పోలీసు అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
నిలకడగా మిలిగిలిన రోగుల పరిస్థితి: చిత్తూరు ఎస్పీ
ఆక్సిజన్ సప్లైని బల్క్ సిలిండర్‌కు మార్చే క్రమంలో ఘటన జరిగిందని ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్పష్టం చేశారు. ప్రెజర్ తగ్గడం వల్ల 11 మంది చనిపోయినట్లు నిర్ధరణ అయ్యిందన్నారు. ప్రస్తుతం మిగిలిన రోగుల పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.
'ఆస్పత్రి ఘటనపై తగిన విచారణ జరిపిస్తాం'
ఆస్పత్రి ఘటనపై తగిన విచారణ జరిపిస్తామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. రోగుల బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:
లైవ్ అప్డేట్స్: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి