పునుగు పిల్లి, మూషిక గొర్రె, కొండ గొర్రె, రేచు కుక్క, అడవి కోడి, శేషాచల చిరుత...ఇలా ఎన్నో అరుదైన జీవజాతులకు పుట్టిల్లు శేషాచల అటవీ ప్రాంతం. మరెక్కడా కనిపించనటువంటి ఎన్నో జీవజాతులను, వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు. అలాంటి అంశాలను ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించుకుంది. తితిదే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా తరచుగా అరుదైన జీవులు కనిపిస్తున్నట్లు గుర్తించింది. రాత్రి వేళల్లో సంచరిస్తున్న వన్యప్రాణుల ఫోటోలను అత్యాధునిక సెన్సార్లతో కూడిన కెమెరాల్లో నిక్షిప్తం చేస్తూ అధ్యయనం సాగించింది. సుమారు 82వేల 500 ఎకరాల విస్తీర్ణంలో శేషాచలం అటవీ ప్రాంతం ఉండగా....తన పరిధిలోని 2వేల 700హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఈ జీవజాతులకు ప్రాచుర్యాన్ని కల్పించే ప్రయత్నాన్ని తితిదే ప్రారంభించనుంది.
లాభం ఏంటి?
పార్వేటి మండపం, శ్రీగంధ వనం, కుమారధార-పసుపు డ్యాం రోడ్డు, ధర్మగిరి, పాపవినాశనం మొదలైన ప్రాంతాల్లో ఇప్పటికే పలు అరుదైన జీవ జాతులు తిరుగుతున్నట్లు స్పష్టం చేసుకున్న తితిదే... ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వాటి సంచారానికి సంబంధించిన సూచికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా స్వామి వారి దర్శనానికి వచ్చే.....ఈ వన్యప్రాణుల విశిష్ఠతను తెలియచేయాలని తితిదే భావిస్తోంది. ఇటీవలి కాలంలో వన్యప్రాణులు...తరచుగా ఘాట్ రోడ్ పై వస్తుండటంతో...చిరుత వంటి క్రూరమృగాలు భక్తులపై దాడులకు పాల్పడటం వంటి సంఘటనలను తితిదే దృష్టిలో పెట్టుకుంది. ఇలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయటం ద్వారా భక్తులకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసేందుకు ఉపయోగపడతాయని తితిదే భావిస్తోంది. ఈ మేరకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని తితిదే అటవీశాఖాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.