తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో అభివృద్ధే అజెండాగా భాజపా పోటీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కూటమి అభ్యర్థిని భాజపా, జనసేన నేతలు ప్రకటిస్తారని చెప్పారు. ఎన్నికల కార్యాచరణతోపాటు వివిధ అంశాలపై 15 రోజులుగా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కి 32 జాతీయ రహదారుల పనులు లభిస్తే.. అందులో చిత్తూరు జిల్లాకి 7 దక్కాయని గుర్తుచేశారు.
రాష్ట్రానికి 21 రైల్వే ప్రాజెక్టులు కేటాయించగా అందులో చిత్తూరు జిల్లాకి 4 లభించాయని జీవీఎల్ అన్నారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో భాగంగా తిరుపతికి రూ.2 వేల కోట్లతో 62 ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. ఐఐటీకి రూ.1,074 కోట్లకు గానూ..రూ.525 కోట్లు, ఐజర్ అబివృద్ధికి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. తిరుపతి కేంద్రంగా విమానాశ్రయ విస్తరణ, రోడ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, విశాఖ- చెన్నై కారిడార్, కాలుష్య రహిత వాహనాలు వంటి అభివృద్ధి పనులను భాజపా చేపట్టిందన్నారు. అభివృద్ధిపై తమతో బహిరంగ చర్చకు తెదేపా, వైకాపాలు సిద్ధమా అని జీవీఎల్ సవాల్ విసిరారు. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ నేతలు భాజపా విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: