హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. తితిదే సభ్యుడు పార్థసారథి కృష్ణా జిల్లాలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు గోడపత్రికలు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ధర్మకర్తల మండలి హోదాలో క్రిస్మస్ వేడుకలకు ఎలా హాజరవుతారని ఆయన ప్రశ్నించారు. క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలనుకుంటే తితిదే ధర్మకర్తల మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తితిదే సభ్యుడిగా ఉంటూ క్రిస్మస్ వేడుకులకు హాజరైతే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తిరుమలలో నాదనీరాజనంపై జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కాని పార్థసారథి...తితిదే ధర్మకర్తల మండల సభ్యుడి హోదాలో అన్యమత ప్రచార సభలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. తితిదే వెంటనే ఓ సర్క్యులర్ జారీ చేయాలని..హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తితిదే 30 యాక్ట్‌లో సవరణలు చేయాలని కోరారు. తితిదే ఉద్యోగులు శ్రీవారి పట్ల మాత్రమే భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలని...క్రిస్మస్ సందర్భంగా అన్యమత ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదన్నారు. ఈ అంశంపై తితిదే అధికారులు నిఘా పెట్టాలన్నారు.
ఇదీచదవండి
తిరుమలకు చీఫ్ విప్ పాదయాత్ర.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో చిత్రీకరణ