Facebook Fraudsters Arrest: ఫేస్‌బుక్‌లో ‘అల్లరి పిల్ల’ ఖాతా ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని తియ్యటి మాటలతో ముగ్గులోకి దించి వారితో అర్ధనగ్నంగా వీడియో కాల్ మాట్లాడి, ఆపై ఫోన్ హ్యాక్‌చేసి నగదు కాజేసే ఎనిమిది మంది సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
"అల్లరి పిల్ల".. చిల్లర బ్యాచ్..
ఈజీ మనీకి అలవాటు పడిన ఓ చిల్లర బ్యాచ్.. ఫేస్‌బుక్‌లో 'అల్లరి పిల్ల' పేరుతో ఓ అకౌంట్ సృష్టించారు. ఆ ఖాతా ద్వారా మగవారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం.. వాటిని అంగీకరించిన వెంటనే చాటింగ్, కుదిరితే వెంటనే ఆన్ లైన్లో మీటింగ్ వీళ్ల పని. పథకం ప్రకారం వీడియో చాట్‌కు ఆహ్వానించి లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేయగానే "అల్లరి పిల్ల" ప్రొఫైల్ పిక్ లోని మహిళ అర్ధనగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుంది. కవ్విస్తుంది.. నవ్విస్తుంది. తియ్యటి మాటలతో.. వివరాలన్నీ రాబడుతుంది. ఆ వివరాలతో వెనకున్న చిల్లర బ్యాచ్.. బాధితుడి ఫోన్ సమాచారం మొత్తం గుప్పిట పట్టే పని పూర్తిచేస్తారు. దీంతో.. ఆ వ్యక్తి ఫోన్ ఆపరేటింగ్ యాక్సిస్ మొత్తం వీళ్ల గుప్పిట్లోకి వచ్చేస్తుంది. అప్పట్నుంచి అతగాడు తన ఫోన్లో ఏం చేసినా.. వీరికి తెలిసిపోతుంది. ఇంకేముంది? వివరాలన్నీ బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేయండం మొదలుపెడతారు.
ఇదేవిదంగా.. చిత్తూరుకు చెందిన సీకే మౌనిక్.. "అల్లరి పిల్ల" వలలో పడిపోయాడు. అంతేనా.. ఏకంగా రూ.3,64,227 పోగొట్టుకున్నాడు! నాలుగు విడతలుగా అతని అకౌంట్ నుంచి ఈ డబ్బు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన మౌనిక్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 'అల్లరిపిల్ల' దగ్గరే తేడా కొడుతోందని పసిగట్టారు. ఈ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు? ఎలా వినియోగిస్తున్నారు? వంటి పూర్తి వివరాలు రాబట్టారు. ఈ 'అల్లరి పిల్ల' అకౌంట్ వెనుక మొత్తం ఎనిమిది మంది ముఠా ఉందని గుర్తించారు. విశాఖపట్నానికి చెందిన అడప సాంబశివరావు(32), ఆనంద్‌మెహతా(35), గొంతెన శ్రీను(21), చందపరపు కుమార్‌రాజా(21), లోకిరెడ్డి మహేష్(24), గొంతెన శివకుమార్(21), వరంగల్‌కు చెందిన తోట శ్రావణ్‌కుమార్(31), కడపకు చెందిన చొప్ప సుధీర్ కుమార్ అలియాస్ సుకు అలియాస్ హనీ(30) కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం వీరిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. 'అల్లరిపిల్ల'గా వీడియో కాల్ మాట్లాడే ముపట్ల మానస మాత్రం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. ఐదు రోజుల్లో ఈ కేసును చేధించిన సీఐ యుగంధర్, ఎస్సైలు మల్లికార్జున, లోకేశ్‌ను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి : Rape on Blind Woman: అంధ యువతిపై అత్యాచారం.. వివాహితుడిపై కేసు నమోదు