శ్రీవారి ఆలయం నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి జమ్మూలో 62 ఎకరాల భూమి మంజూరు అయ్యింది. తిరుమలలోని వెంకటేశ్వర మందిరాన్ని పరిపాలించే తిరుమల తిరుపతి దేవస్థానానికి... మజీన్ గ్రామంలో 62.02 ఎకరాల భూమిని ఇవ్వడానికి జమ్మూ - కశ్మీర్ పరిపాలనా మండలి ఆమోదం తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని కౌన్సిల్... శ్రీనగర్-పఠాన్‌కోట్ రహదారి వెంట సిధ్రా బైపాస్‌లో భూమిని తితిదేకు 40 సంవత్సరాల లీజుకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది.
జమ్మూలోని మజీన్ గ్రామంలో 496 కనాల్ 17 మాల్రా (62.02 ఎకరాలు) రాష్ట్ర భూమిని తితిదేకు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఆలయం, దాని అనుబంధ మౌలిక సదుపాయాలు, యాత్రికుల సౌకర్యాల సముదాయం, వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, ఆఫీసు, రెసిడెన్షియల్ క్వార్టర్స్, పార్కింగ్ వంటి వాటికి... స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 40 సంవత్సరాల కాలానికి లీజు ప్రతిపాదన ఆమోదించారు. ఆలయ నిర్మాణం పూర్తయితే.. మాతా వైష్ణోదేవీ ఆలయం, అమర్నాథ్ క్షేత్రాల తరహాలో.. పర్యాటకంగా అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని అక్కడి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:
తిరుపతి: పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న జాతీయ విద్యాసంస్థలు