వైకాపా ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బీసీల్లో సుమారు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చేందుకు కార్యాచరణ ఉంటుందని ఎంపీ భరత్ చెప్పారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీసీ సంక్షేమ సంఘం నగర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు దేవీచౌక్ నుంచి ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు.
బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా వారికి రాజ్యాధికారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకర్రావు కోరారు. దామాషా ప్రకారం తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. బీసీలకు క్రీమీలేయర్ విధానం ఉండటం బాధాకరమన్నారు.