ఆదివారం విరామం తరువాత అమరావతి రైతులు కొవ్వూరు నుంచి పాదయాత్రను ప్రారంభమైంది. గోదావరి 4 వ వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి అన్నదాతలు అడుగుపెట్టనున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కాతేరు మీదుగా మల్లయ్యపేట వరకూ దాదాపు 14 కి.మీ మేర 36 వ రోజు యాత్ర సాగనుంది. కొవ్వూరు - రాజమహేంద్రవరం రైల్ కం రోడ్డు వంతెనపై ఆంక్షల నేపథ్యంలో రైతులు గోదావరి నాలుగో వంతెన మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు.
కొత్తగా వెళ్లనున్న మార్గంలో ఎంతమందితో యాత్ర నిర్వహించనున్నారనే దానిపై సమాచారం ఇవ్వాలని పోలీసులు ఐకాస నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. న్యాయస్థానం అనుమతితోనే యాత్ర చేస్తున్నామని.. ఏమైనా చెప్పదలచుకుంటే న్యాయస్థానం ద్వారా చెప్పాలని అమరావతి రైతులు పోలీసులకు స్పష్టం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే, హోం మంత్రి తానేటి వనిత... నేడు మూడు రాజధానుల నినాదంతో రాజమహేంద్రవరం బస్టాండ్ కూడలి సమీపంలో సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రైతుల యాత్ర బస్టాండు మీదుగా కాకుండా మరో మార్గంలో వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: