తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తి రెడ్డిగూడెంలో ఆనంతుల లక్షమ్మ అనే 84 ఏళ్ల వృద్ధురాలిని కొడుకులు ఇంటి నుంచి గెంటేశారు. 70 ఎకరాల ఆస్తి ఇచ్చిన అమ్మను అనాథగా వదిలేశారు. పుట్టినప్పటి నుంచి కొడుకులను కంటికి రెప్పలా కాపాడిన తల్లిని ఆ పుత్రులే నడిరోడ్డుపై వదిలేసిన ఘటన అందరినీ కంట తడి పెట్టిస్తోంది. నవమాసాలు మోసిన ఆ మాతృమూర్తిని నెల కూడా మోయలేని కసాయి కుమారులు బయటకు గెంటేశారు. ఐదు రోజులుగా చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ఆ తల్లి.
ఒక్క మాట కూడా
లక్షమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. 25 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు పిల్లల వద్దే ఉంటూ ఇంటి పనిచేసింది. ఆ తర్వాత కుమారులు నెలకు ఒక్కరు పోషించేలా పెద్దలు ఒప్పందం చేశారు. నాలుగు రోజులు క్రితం రెండో కొడుకు భార్య.. అత్త లక్షమ్మను ఇంటి నుంచి గెంటేసింది. అప్పటి నుంచి ఒక చెట్టు నీడన ఆశ్రయం పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మమ్మ కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామస్థులు కొడకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా... కుమారులను ఒక్క మాట అనకుండా మాతృమూర్తి మనసు చాటుకుంది లక్ష్మమ్మ.
ఇవీ చూడండి:'రూపాయి ఇడ్లీ' బామ్మ పరుగు పందెంలోనూ టాప్!