Tension at Amaravati farmers Padayatra: ఏకైక రాజధాని కోసం అన్నదాతలు రాజమహేంద్రవరంలో శాంతియుతంగా చేస్తున్నపాదయాత్ర.. వైకాపా వర్గీయుల దాడితో రణరంగంగా మారింది. వైకాపా ఎంపీ మార్గాని భరత్... స్వయంగా ఆందోళనకు దిగడంతో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు.. రాళ్లు, కర్రలు, నీళ్ల సీసాలు, ప్యాకెట్లు, కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లతో తమపై దాడి చేశారని మహిళా రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రాణం పోయినా పాదయాత్ర మాత్రం ఆపేదే లేదని తేల్చి చెప్పారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 37వ రోజు రైతులు చేస్తున్న మహా పాదయాత్ర రాజమహేంద్రవరంలో రణరంగాన్ని తలపించింది. పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైకాపా నేతలు.. వైకాపా ఎంపీ మార్గాని భరత్ సమక్షంలో మరింత రెచ్చిపోయారు. స్థానిక ఆజాద్‌చౌక్ సెంటర్‌లో నీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లతో అమరావతి రైతులపై దాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి.
వైకాపా శ్రేణులు సంచిలో కర్రలు రాళ్లు చుట్టి రైతులపైకి విసిరారు. వాటర్ బాటిళ్ల మాటున పెట్రోల్ సీసాలతోనూ తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు. అన్నదాతలపై దాడికి డీజీపీ ఏం సమాధానం చెప్తారని ఐకాస నేతలు ప్రశ్నించారు. పోలీసుల మాటునే రైతులపై దాడి జరిగిందని మండిపడ్డారు. మూడేళ్ల నుంచి ఎన్నో అవమానాలు, మరెన్నో దాడులు ఎదుర్కొన్నమన్న రైతులు.. ప్రాణం పోయినా పాదయాత్ర పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు.
వైకాపా దాడులు, మండుటెండను సైతం లెక్కచేయక కదం తొక్కుతున్న రైతులకు స్థానికులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, కులవృత్తి సంఘాలు మద్దతు తెలిపాయి. చిన్నబిడ్డను వెంటపెట్టుకుని నెలలు నిండిన మరో బిడ్డను కడుపులో మోస్తూ పాదయాత్రలో పాల్గొన్న స్థానిక మహిళ ఆషా స్ఫూర్తితో రైతులు ముందుకు సాగారు. చెప్పులు తెగి, పాదాలు సహకరించకపోయినా నడుస్తున్న 84ఏళ్ల వృద్ధురాలు సుదీష్ణ సంకల్పానికి స్థానికులు చలించిపోయారు. మల్లయ్యపేట నుంచి సీతంపేట, ఆర్యాపురం సెంటర్, గోకవరం బస్టాండ్, దేవీ చౌక్, ఎన్టీఆర్ విగ్రహం, కోటిపల్లి బస్టాండ్ మీదుగా మున్సిపల్ స్టేడియం వరకూ అన్నదాతలు యాత్ర సాగించారు.
అచ్చెన్నాయుడు: అమరావతి రైతులపై దాడి దుర్మార్గమని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. త్యాగాలు చేసిన రైతులకు ఇచ్చే గౌరవమిదేనా? అని నిలదీశారు. వైకాపా ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన దాడి జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగింది.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. నేరస్థుడి పాలనలో ఏపీ నాశనమవుతున్న విషయం మరోసారి బహిర్గతమైందని చెప్పారు. దాడి జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలని ధ్వజమెత్తారు. పాదయాత్రకు కూడా రక్షణ కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన రైతులకు జగన్ ఇచ్చే గౌరవమిదేనా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులతో వేధిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎంపీ భరత్‌తో పాటు వైకాపా నేతలందరిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
యనమల: భూములిచ్చిన రైతులపై వైకాపా నేతల దాడులు సిగ్గుచేటని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతోనే రైతులపై వైకాపా మూక దాడికి దిగిందని ధ్వజమెత్తారు. భద్రత కల్పించాలని హైకోర్టు చెప్పినా దాడులు జరగడం ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. ఎంపీ భరత్ ఆధ్వర్యంలోనే వైకాపా నేతలు దాడి చేశారన్నారు. అరాచకం, దాడులు, దౌర్జన్యాలే తప్పా.. రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు. మూడున్నరేళ్లలో ఏ ప్రాంతాన్నీ అభివృద్ధి చేయలేని చేతకాని ప్రభుత్వమన్నారు. వైకాపా పెయిడ్ బ్యాచ్ అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని యనమల కోరారు.
గద్దె తిరుపతిరావు: శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రపై దాడులు చేయాల్సిన అవసరమేంటని అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమందిని చంపుతారో చంపండని గద్దె తిరుపతిరావు ధ్వజమెత్తారు. హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నామని స్పష్టం చేశారు. డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాం.. మాకు రక్షణ కల్పించండి అని వేడుకున్నారు. ఇలాంటి దొంగలు, రౌడీయిజం చేసేవాళ్లు ప్రజాప్రతినిధులా? అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు దొంగలకు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తమపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. డీజీపీ తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలని గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు.
న్యాయవాది ముప్పాళ్ల: శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని న్యాయవాది ముప్పాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా? అని నిలదీశారు. వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు విసిరితే ఏమనుకోవాలన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వ్యక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తుంటే అక్కడే సమావేశానికి అనుమతి ఎలా ఇచ్చారని నిలదీశారు. నియంతృత్వ పోకడలు ఎక్కువకాలం సాగవని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కోరారు.
ఇవీ చదవండి: