రాజమహేంద్రవరంలో షార్ట్ ఫిల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ ఉగాది పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అలీ, పృథ్వీరాజ్, గౌతంరాజు తదితరులు హాజరయ్యారు. గోదావరి తీరం ఎందరో గొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు అందించిందని అలీ అన్నారు. కళామతల్లి, అభిమానుల దయతో 13 వందల చిత్రాల్లో నటించానని చెప్పారు. ప్రపంచ ప్రజల్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి త్వరగా అంతమవ్వాలని అలీ ఆకాంక్షించారు.
లఘుచిత్రాల ద్వారా ఎందరో గొప్ప నటులు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారని నటుడు పృథ్వీరాజ్ అన్నారు. షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించి.. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందించామని అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. వారికి మరింత మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. కళాకారుల్ని సన్మానించాలన్న ఉద్దేశంతో ఈ ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: చరణ్‌తో చిత్రంపై 'జెర్సీ' దర్శకుడి క్లారిటీ