Dhavaleswaram flood: గోదావరిలో వరద మరింతగా పెరుగుతోంది. రాజమహేంద్రవరం వద్ద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 14.30 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.59 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద పోటుతో కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ప్రమాదకంగా ప్రవహిస్తున్నాయి. లంకలు ముంపు బారిన పడ్డాయి. జి.పెదపూడి లంక వద్ద కాజ్వే నీట మునిగింది. నడుం లోతు నీటిలో లంకవాసులు నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతున్నారు.
కనకాయ లంక వద్ద నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కె. ఏనుగుపల్లిలంక కాజ్ వే మునిగిపోవడంతో లంక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలంలోనూ గౌతమీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎదురుబీడెం కాజ్ వే నీట మునిగింది. ముమ్మిడివరం, ఐ.పోలవరం కె.గంగవరం మండలాల్లో తీరం వెంబడి నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. యానాం తీరాన్ని వరద నీరు నీట ముంచేసింది. వశిష్ట గోదావరి తీరం మామిడికుదురు మండలంలోనూ లంకలు నీట మునిగాయి. భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. విలీన మండలాలు వరద ముంపులోనే మగ్గిపోతున్నాయి రహదారులు మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సహాయక చర్యల్లో మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, అమలాపురంలో 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్, వీఆర్‌పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలుచేపట్టాయి. ఏలూరు జిల్లా, కుకునూర్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
పులిచింతల: పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు 12 గేట్లు 2.5 మీటర్ల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,53,217 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,47,384 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటినిల్వ 36.91 టీఎంసీలు. పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు.
ఇవీ చదవండి: