Proposal For Stadium: రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ ఆర్ట్స్ కళాశాల.. చారిత్రక వారసత్వ సంపద. దేశంలో న్యాక్ ఎ-ప్లస్ (NAC) గ్రేడ్ సాధించిన డిగ్రీ కళాశాల. ఇంత గొప్ప విద్యాలయం ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదంలో పడుతోంది. విశాల ప్రాంగణాన్ని వివిధ నిర్మాణాలకు కేటాయించడంతో ఇప్పటికే చిక్కి సగమైంది. తాజాగా అధికారులు ఇక్కడ 14 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి యోచిస్తున్నారన్న వార్తతో విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 1853లో 46 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైంది. తర్వాత వివిధ విద్యా, ఇతర సంస్థలకు 20 ఎకరాలు కేటాయించారు. ఇటీవల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వారం క్రితం కళాశాల వైస్ ప్రిన్సిపల్, మరికొందరు అధ్యాపకులను కలెక్టర్ పిలిచి, స్టేడియం నిర్మాణం గురించి మాట్లాడారని కొందరు అధ్యాపకులు చెబుతున్నారు.
14 ఎకరాల స్థలాన్ని స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తే కళాశాలకు మిగిలేది 12 ఎకరాలే. దీనివల్ల కళాశాలకు ఇటీవల ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ప్రభుత్వ విశ్వవిద్యాలయ హోదా రాదు. ప్రస్తుతం కళాశాలలో వివిధ కోర్సుల్లో 7వేల మంది చదువుతున్నారు. ఉన్న తరగతి గదులు సరిపోక రెండు విడతలుగా తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తరగతి గదులు, ప్రయోగ శాలలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు విస్తరించాలి. స్టేడియం నిర్మిస్తే ఇవేవీ సాధ్యం కావు. స్టేడియం నిర్మాణ ప్రాంతంలో విద్యార్థులకు క్రీడా స్థలం ఉంది. స్టేడియం వస్తే విద్యార్థుల క్రీడా సాధనకు ఆటంకం తప్పదు. కళాశాల మైదానాన్ని నాన్ అడకమిక్ కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చి, ఆ మొత్తాన్ని కళాశాల ప్రణాళిక, అభివృద్ధి మండలిలో జమ చేసి కళాశాల అభివృద్ధికి వినియోగిస్తారు. స్టేడియం నిర్మిస్తే భవిష్యత్తులో ఈ ఆదాయం రాదు. ప్రాంగణంలో ఇటీవలే రూ.70 లక్షలతో 4 తరగతి గదులు నిర్మించారు. స్టేడియం నిర్మించాలంటే వీటిని తొలగించే ప్రమాదం ఉంది.
విషయాన్ని పునఃపరిశీలిస్తాం
"క్రికెట్ స్టేడియం నిర్మాణం వల్ల ఇబ్బందులను పూర్వ విద్యార్థులు ‘స్పందన’లో చెప్పారు. నిర్మాణ అంశాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రతిపాదించారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. అధికారులు, కళాశాల ప్రధాన అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. సాధ్యాసాధ్యాలు మరోసారి పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాం." -కె.మాధవీలత, కలెక్టర్ తూర్పుగోదావరి
ఇవీ చదవండి: రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు