రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బుధవారం భీమిలి మండల పర్యటనలో నిరసన సెగ తగిలింది. జీవీఎంసీ నాలుగో వార్డు పరిధి కాపులదిబ్బడిపాలెంలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని రింగుల వలల యజమానులు, కలాసీలు, మత్స్యకార మహిళలు చుట్టుముట్టి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘భీమిలి ఎమ్మెల్యేగా మీరు గెలిచినా మాకేముంది? రింగుల వలలను వేటకు వెళ్లనీయక అప్పుల పాలయ్యాం. మా బాధలు మీకు పట్టవా? ఎన్నాళ్లు ఉపాధి లేకుండా చేస్తారు’ అంటూ మంగమారిపేట, దిబ్బడిపాలెం, చేపలుప్పాడ ప్రాంతాల రింగుల వలల మత్స్యకారులు మంత్రిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి.. ‘ఎక్స్‌ట్రాలు మాట్లాడకండి. లైసెన్సులు తీసుకోకుండా ఏం మాట్లాడుతున్నారు’ అనడంతో వారంతా హతాశులయ్యారు. ఈ దృశ్యాన్ని విలేకర్లు చిత్రీకరిస్తుండగా మంత్రి గన్‌మెన్ సెల్‌ఫోన్లు లాక్కున్నారు. సెల్‌ఫోన్లలోని వీడియోలు, ఫొటోలు తొలగించి తిరిగిచ్చారు. అనంతరం చేపలుప్పాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రింగుల వల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తెదేపా నాయకులు దీనిపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: Chalo Vijayawada: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం... ఉద్యోగ, ఉపాధ్యాయుల గృహనిర్బంధం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!