‘గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో దొరికిన డ్రగ్స్ విషయంలో మన రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ చెప్పాం.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాం. తప్పుడు ఆరోపణలు సరికాదు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ వాళ్లూ ఇదే విషయం స్పష్టం చేశారు. ఈ కేసుతో రాష్ట్రానికి.. పోలీసు శాఖకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై రాష్ట్ర పోలీసులను అపరాధులను చేయాలనుకోవడం సరికాదు. ఇటీవల ఎన్‌సీబీ నమోదుచేసిన ఓ కేసులో మన రాష్ట్రంలోని నరసాపురం పేరు వచ్చింది. ఆ కేసుతోనూ ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్‌సీబీ వాళ్లు స్పష్టత ఇచ్చారు. ఇవన్నీ ఆరోపణలే తప్ప... వీటిలో వాస్తవాలు లేవు’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి, రవాణా వంటి అంశాలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం రాజమహేంద్రవరంలో డీజీపీ ఆధ్వర్యంలో సమీక్షించారు. అనంతరం మీడియాతో డీజీపీ మాట్లాడారు. గంజాయి నిర్మూలనకు తెలంగాణ, ఒడిశా డీజీలతో మాట్లాడామని, ఎన్‌సీబీ, ఎన్‌ఐఏ సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి సాగు, రవాణాలో కేరళ, హరియాణా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వారి పాత్ర కూడా ఉందన్నారు. గత ఏడాది 470 మంది ఇతర రాష్ట్రాల వారిని మన పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. సమీక్షలో రాష్ట్రంలోని 45 మంది ఐపీఎస్‌లు పాల్గొన్నారు.
ఆపద వస్తే అండగా ఉంటాం
వెంకటరమణ కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతున్న డీజీపీ సవాంగ్
పోలీసు కుటుంబసభ్యులకు ఆపద వస్తే అండగా ఉంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో కరోనాతో మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ కట్టా వీర వెంకటరమణ కుటుంబాన్ని డీజీపీ పరామర్శించారు. రమణ చిత్రపటానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. తమ శాఖలో అమరుల కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.