Bolashankar temple: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో మరో దివ్య క్షేత్రం నిర్మితమైంది. ఇన్నీసుపేటలోని కైలాస భూమి దగ్గర.. రెండెకరాల విస్తీర్ణంలో మహాకాళేశ్వర ఆలయం అద్భుతంగా నిర్మించారు. రాజమహేంద్రవరంలో రెండు స్మశాన వాటికలను కైలాస భూమి పేరిట రోటరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రోటరీ సంస్థ నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావు మహేకాళేశ్వర్ ఆలయానికి రూపకల్పన చేశారు. ఉజ్జయిని ఆలయం మాదిరిగా.. ఇక్కడ భోళా శంకరుడికి చితాభస్మంతో అభిషేకాలు చేయాలని.. నిర్ణయించుకున్నారు. ఐదేళ్లపాటు శ్రమించి మహాకాళేశ్వర ఆలయాన్ని ఎంతో అందంగా నిర్మించారు.
మహాకాళేశ్వర ఆలయం ప్రత్యేకతను కలిగి ఉండటం కోసం... చుట్టూ ప్రాకారం, రాజగోపురాలు నిర్మించారు. నాలుగు దిక్కులు, నాలుగు వేదాలు ప్రతిబింబించేలా.. నాలుగు దర్శన ద్వారాలు, నాలుగు మండపాలు, నాలుగు నందులను ఆలయ ప్రాగణంలో తీర్చిదిద్దారు. గర్భాలయంలో సుమారు 9 అడుగుల మహా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దక్షిణాన మహాకాళి అమ్మవారు, ఉత్తరాన చండికేశ్వర అమవార్లు కొలువుదిరారు.
ఆలయ ప్రాకారం చుట్టూ.. 64 ఉపాలయాలను నిర్మించారు. శైవ, శక్తి స్వరూపాలు, అష్టలక్ష్ములు, దశావతారాలను ద్వైత, అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలయం నిర్మాణం చేశారు. ఆలయ పైభాగంలో రాజస్థాన్ శిల్ప కళా వైభవంతో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. ఈ దేవాలయంలో ఉన్న నవగ్రహ మండపం నాగ బంధాలతో నిర్మితమై ఉంది. రెండు కైలాస భూమి నుంచి నిత్యం చితాభస్మాలను సేకరించి..ఉజ్జయిని తరహాలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
ఆలయ శిల్పాకళా నైపుణ్యం.. విశేషంగా ఆకట్టుకుంటోందని భక్తులు చెబుతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
ఇదీ చదవండి: