నెల్లూరు జిల్లాలోని కూరగాయల మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. టమోటాలు కేజీ 40 రూపాయలు, పచ్చిమిర్చి 45, ఉల్లిగడ్డలు 45, క్యారెట్ 70, బీట్రూట్ 45, బెండకాయలు 45, బీన్సు 50నుంచి 80రూపాయలు దాకా ధర పలుకుతుంది. పందిరి చిక్కుడు కేజీ 50 నుంచి 80 రూపాయల మేర మార్కెట్లలో ధర పలుకుతుంది.
డిమాండ్ పెరగడంతో....
జిల్లా వ్యాప్తంగా పడుతున్న వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, గూడూరు, కలిగిరి, నెల్లూరు గ్రామీణం ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తారు. ఇక్కడి కూరగాయలు దిగుబడి తగ్గడంతో ఉన్న కూరగాయలను వ్యాపారులు ధరలు పెంచారు.
తమిళనాడులోని కోయంబేడు , కర్నాటకలోని కోలార్ నుంచి క్యారెట్, బంగాళాదుంప, క్యాబేజి, కొత్తిమేర నెల్లూరుకు వస్తుంటాయి. కరోనాతో కోయంబేడు మార్కెట్ నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో కొన్ని రకాలైన కూరగాయలు సప్లైయ్ తగ్గింది. డిమాండ్ పెరగడంతో ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
కరోనా కాలంలో ప్రజలకు ఎలాంటి పనులు దొరకపోవడంతో...ఆదాయం లేదు. ఈ పరిస్థితుల్లో కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వ్యాపారులు కూడా కావాలని ధరలు పెంచుతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో.. వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
కూరగాయలు పండించిన రైతుకు పెద్దగా లాభం కూడా దక్కడం లేదు. దళారులు , వ్యాపారులు మాత్రం ధరలు పెంచి లాభపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు జోక్యం చేసుకుని కూరగాయల ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సామాన్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: