సోమశిల ప్రాజెక్టు నుంచి అదనపు నీటి విడుదలకు కారణమైన అసిస్టెంట్ ఇంజినీరు, డివిజనల్ ఇంజినీరులపై వేటు వేయడం నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించింది. చీఫ్ ఇంజినీరు ప్రాజెక్టు పరిశీలనతో సోమశిలలో జరిగిన అక్రమాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టులో అంతర్గత విభేదాలతో పాటు ఒక ప్రాంతానికి లబ్ధి చేకూర్చేందుకే నీటి విడుదల జరిగినట్లు తేలింది. ప్రస్తుతం జరిగిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న మంత్రి అనిల్‌కుమార్ నెల్లూరు జడ్పీలో ఏఈ, డీఈలను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
రెండు నెలల కిందట రెండో పంటకు నీటి కేటాయింపులు, అధికారిక ఆయకట్టును స్వయంగా మంత్రే అనేక మార్లు పరిశీలన చేసి నిర్ణయించారు. అదే సమయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి రెండో పంటకు డెల్టాకు 20 టీఎంసీలు, ఇతర ప్రాంతాలకు 7.5 టీఎంసీలు కేటాయించారు. కానీ ప్రస్తుతం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అధికారిక ఆయకట్టు లేకపోయినా స్థానిక నాయకులు ఇటీవల కాలంలో నీటిపెత్తనం మొదలుపెట్టారు. జిల్లా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ రెండో సాగుకు 2.50 లక్షల ఎకరాలకు నీటి విడుదల జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని విడుదల చేయడం.. సస్పెండైన ఏఈ, డీఈతో సాధ్యమవుతుందా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది. జరిగిన సంఘటనపై పూర్తి వివరాలతో నివేదిక మంత్రికి చేరింది. దీనిపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి : కరోనా వేళ జీవితానికో లేఖ రాయకూడదా?