వచ్చే ఉగాదికి పేదలందరికీ ఇళ్లు అందించే కార్యక్రమానికి జిల్లా అధికారులు కృషి చేయాలని... మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, చెరుకూరి శ్రీరంగనాథ రాజు సూచించారు. సమస్యల్ని పరిష్కరించి వెంటనే లబ్ధిదారులకు గృహాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ రికార్డుల నవీకరణ అంశాలపై నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, చెరుకూరి శ్రీరంగనాథ రాజు సమీక్ష నిర్వహించారు.
దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న భూముల వివరాలు, చుక్కల భూములు తదితర సమస్యల పరిష్కారం సత్వరమే అయ్యే విధంగా రెవెన్యూ రికార్డుల నవీకరణ చేపడుతున్నామని మంత్రులు వివరించారు. రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తగ్గించేందుకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని కలెక్టరుకు సూచించారు. రానున్న రోజుల్లో జమాబందీ నిర్వహించుకొని ఆడిటింగ్ చేయాలని... గ్రామంలో వీఆర్వో స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఆడిటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
రానున్న మూడు నెలల్లో భూసర్వే చేసి నూతన ల్యాండ్ టైటిల్ చట్టం అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మే 31 లోగా రెవెన్యూ శాఖను ఆధునిక సాంకేతికతతో నవీకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకానికి 1,78,174 మంది లబ్ధిదారులున్నారని తెలిపారు. వీరికి పంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2,343 ఎకరాలు, పట్టణంలో 509 ఎకరాల భూమి అవసరం ఉందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను గుర్తించడంలో జిల్లా అధికారుల పనితీరు రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉందని అభినందించారు.
ఇదీ చదవండి:తెలుగు భాషపై ఫ్రాన్స్ దేశస్థుడి మమకారం..!