నెల్లూరులో మానవత్వం మంటగలిపేలా ఓ అపార్టుమెంట్ వాసులు ప్రవర్తించారు. కరోనా బాధితులు ఉన్న ఫ్లాట్‌కు తాళం వేశారు. వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. గత పది రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న భార్యభర్తలు.. బంధువుల ద్వారా అవసరమైన మందులు, ఇంటి సామాగ్రి తెచ్చుకుంటున్నారు. రాత్రి మందులు అవసరంకాగా.. ఎవరు అందుబాటులో లేకపోవడంతో భర్త బయటకు వెళ్లి మందులు తీసుకువచ్చారు. కరోనా సోకిన వ్యక్తి బయటకు రావడంతో, తమకు కరోనా సోకుతుందని బయపడిన అపార్టుమెంటు వాసులు తెల్లారేసరికి ఇంటికి తాళం వేశారు. కరోనా వచ్చిన వ్యక్తి బయట తిరగడం వల్లే తాళం వేసినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కనీసం కనికరం లేకుండా తాళం వేశారని బాధితులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి తాళం తొలగించారు.
ఇదీ చదవండి: కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు