Minister Gautam Reddy funeral: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని నివాసం నుంచి మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఈ ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చే వారి కోసం ఖాళీ స్థలంలో టెంట్లు, తాగునీటి వసతి, కుర్చీలు ఏర్పాటు చేశారు.
బుధవారం అంత్యక్రియలు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన...రెండ్రోజుల పాటు ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినట్లు చెప్పారు.
అన్ని కార్యక్రమాలు వాయిదా
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందినట్లు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రి మృతికి సంతాప సూచకంగా 2 రోజులు అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రకటించారు. నేడు జరగాల్సిన జగనన్న తోడు మూడోవిడత ఆర్ధిక సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఈ సాయాన్ని అందిస్తామన్నారు.
బాధితులకు బాసటగా
మేకపాటి గౌతమ్ రెడ్డి ఎన్నోసార్లు బాధితులకు బాసటగా నిలిచారు. రెండు నెలల కిందట సంగం మండలంలోని బీరా పేరు వాగులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన బాలుడిని గౌతమ్ రెడ్డి పరామర్శించారు. బాలుడి బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. మర్నాడే రూ.10 లక్షలు సొంత సొమ్మును బాలుడి పేరుతో డిపాజిట్ చేశారు. సంక్రాంతికి ముందురోజు అతని దగ్గరకు వెళ్లి కొత్త దుస్తులు అందించిన మంత్రి...బాగా చదువుకోవాలని సూచించారు.
బాలలతో ముచ్చట్లు
గత నెల సంగం ఎస్సీ కాలనీకి వచ్చిన మంత్రి...అక్కడ కనిపించిన బాలలతో మాటలు కలిపారు. పాఠశాలలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పగా... కార్యక్రమాన్ని అర్థంతరంగా ముగించుకొని ... అర కిలోమీటరు వారితో కలిసి నడిచివెళ్లి పాఠశాలను సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి