బీమా పేరుతో ప్రజలను మోసగిస్తున్న బాలమురళీకృష్ణ అనే వ్యక్తిని.. నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది జరిగిన ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ప్రమాదంతో.. ఈ మోసం బయటకొచ్చింది. ప్రమాదంలో నష్టపోయిన బాధితుడు బీమా కోసం దరఖాస్తు చేసుకోగా.. అవి నకిలీ పత్రాలని తేలింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించారు.
నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయం వద్ద దుకాణం ఏర్పాటు చేసిన నిందితుడు.. వాహనాలకు నకిలీ బీమాపత్రాలు ఇస్తున్నట్లు డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. 'ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి.. ఆ సొమ్ము సొంతానికి వాడుకుంటున్నట్టు చెప్పారు. నిందితుడితో పాటు అతని భార్యకూ ఇందులో ప్రమేయం ఉందని తేలిందన్నారు. వందలాది మందిని మోసగించి లక్షల దండుకున్నట్లు అనుమానం ఉందని చెప్పారు. నిందితుల నుంచి ప్రింటర్లు, కంప్యూటర్, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి: