నెల్లూరు జిల్లాలో విషజ్వరాలు కోరలు చాచాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక..... డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా... పిల్లల కేకలు, పెద్దల మూలుగులే. జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 వరకూ సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ నెలలో సుమారు 5 వేల మందికిపైగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించారు. నెల్లూరు, కావలి, గూడూరులో సుమారు 20వేల మంది ప్రైవేట్ వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్క నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోనే.... జనవరి నుంచి ప్రతినెలా సగటున 200 మందికిపైగా జ్వరాలతో చికిత్స పొందారు. సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 614 మందికి పెరిగింది. అందులో 17 డెంగీ కేసులూ నమోదయ్యాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్న వారితో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేదని... ఎలాంటి వ్యాధికైనా మందులు పూర్తిస్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. డెంగీ నిర్ధరణ పరీక్షలూ ఉచితంగా నిర్వహిస్తామంటున్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. పరిశుభ్రతపై జిల్లావ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. నెల్లూరు ఆసుపత్రిలో మాత్రమే అన్ని సౌకర్యాలు ఉన్నందున... దూరప్రాంతాల ప్రజలు రావడానికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితి తప్పాలంటే... ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్య సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: