కృష్ణా జిల్లాలో..
కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో నందిగామ ప్రాంతంలో పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సీఐ కనకారావు, ఇతర సిబ్బంది గ్రామాల్లో మైక్‌లతో ప్రచారం చేస్తూ.. విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నందిగామ మండలంలో ఇప్పటికే 59 పాజిటివ్ కేసులు రాగా.. అత్యధికంగా నందిగామలోనే 40 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. దీంతో పాటు పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
మాస్కు ధరించకుండా వ్యాపారాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. వారిపై జరిమానా విధిస్తామని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి హరినాద్ బాబు హెచ్చరించారు. ఆయన స్థానిక కార్యదర్శులు, సిబ్బందితో కలిసి రంపచోడవరంలో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా వ్యాపారం చేస్తున్న వారిపై అపరాధ రుసుము కింద రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు మాస్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెండో పట్టణ పోలీసు స్టేషన్ నుండి శ్రీనివాస్ భవన్ కూడలి వరకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పోలీసులు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శానిటైజర్లను తప్పక వాడాలన్నారు. మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించనున్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఎమ్మెల్యే మాస్కులు పంచి అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి: