కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులను మార్కెట్ కష్టాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముందుగా వేసిన పంట చేతికందినా.. కరోనా వల్ల మార్కెట్ మూతపడటంతో, పంటను అమ్మునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్ కష్టాలతో అవస్థలు పడిన రైతులకు దెబ్బమీద దెబ్బలాగా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచటం లేదు.
జిల్లాలో 15 వేల హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, ఆస్పరి, పత్తికొండ, కోసిగి, నందవరం మండలాల్లో అధికంగా ఉల్లి పంటను వేశారు. గతేడాది ఇదే సమయానికి ఉల్లికి అధిక ధర లభించటంతో.. చిన్నకారు రైతులు సైతం ఉల్లిని సాగు చేశారు. కరోనా కారణంగా మార్కెట్ మూసివేయటంతో.. అందివచ్చిన పంటను ఎలా అమ్మాలో అర్థంకాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు సైతం కూలీ ఇచ్చేందుకు డబ్బులు లేవనీ.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి తమను ఆదుకోవాలని రైతులు అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: 'పశువుల విస్తరణకు పశుసంవర్ధక శాఖ కృషి చేయాలి'