రక్తదానం విషయంలో యువతులతో పోల్చితే యువకులే ఎక్కువగా ముందుకొస్తుంటారు. ప్లాస్మా దాతల్లోనూ యువకులే ఎక్కువ. కానీ కర్నూలు జిల్లాకు చెందిన ఇర్ఫానా బేగం అనే యువతి కరోనా నుంచి కోలుకుని రెండుసార్లు ప్లాస్మా దానం చేశారు. ఇద్దరి ప్రాణాలు కాపాడారు. డోన్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఇర్ఫానా బేగంతో పాటు ఆమె తల్లిదండ్రులకూ కొద్ది నెలల క్రితం కరోనా సోకింది. తండ్రి ప్రభుత్వ క్వారంటైన్‌లో కుమార్తె, తల్లి హోం క్వారంటైన్‌లో ఉండి మహమ్మారిని జయించారు.
ప్లాస్మా దానంతో కరోనా రోగులను బతికించవచ్చని తెలుసుకున్న ఇర్ఫానా.. హైదరాబాద్‌లో కరోనాతో పోరాడుతున్న డోన్‌కు చెందిన ఓ రోగికి ప్లాస్మా అవసరమని ఓ సంస్థ ద్వారా సమాచారం అందుకున్నారు. సొంత ఖర్చులతో సెప్టెంబర్‌లో యశోద ఆసుపత్రికి వెళ్లి ప్లాస్మా దానం చేశారు. అక్టోబర్‌లో మరోసారి ఇంకో రోగి కోసం హైదరాబాద్ వెళ్లి ప్లాస్మా ఇచ్చారు. తన వల్ల ఇద్దరు రోగులు కోలుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇర్ఫానా చెబుతున్నారు.
ప్లాస్మా ఇవ్వడమే గాక ఓ సంస్థ సహకారంతో మాస్కులు తయారు చేసి అనాథలు, యాచకులకు ఇర్ఫానా ఉచితంగా పంపిణీ చేశారు. పనిలేక ఇబ్బందిపడుతున్న దర్జీలకు మాస్కుల ఆర్డర్ ఇప్పించి ఉపాధి కల్పించారు. మాస్కుల ద్వారా వచ్చిన సొమ్ముతో పేదలకు నిత్యావసర వస్తువులతో పాటు ఆహారం పంపిణీ చేశారు.
ప్లాస్మా దానం చేసినందుకు గుంతకల్లుకు చెందిన రోటరీ క్లబ్ సంస్థ ఇర్ఫానాను ఘనంగా సన్మానించింది. కరోనా విజేతలు ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని ఆమె సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు