రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. భాజపా జిల్లా స్థాయి వర్క్‌షాప్ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పరిపాలన ప్రజలు చూశారని... వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీ భాజపాకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాజధాని విషయంలో మంత్రులు చేసిన ప్రకటనల వల్ల రైతులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా ఇవ్వాలని హితవు పలికారు. రాజధాని మార్పు చేస్తే వ్యతిరేకిస్తామన్న కన్నా లక్ష్మీనారాయణ... రాజధాని అమరావతిలోనే ఉంటుందని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ఇప్పటికే రూ.9వేల కోట్లు ఖర్చు అయ్యిందన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథాచెయ్యదని భావిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ...అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులా..?