మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి రచించిన "జై గ్రేటర్ రాయలసీమ'' పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పుస్తక రచయిత గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీమంత్రి మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రెడ్డి, వీరశివారెడ్డి, శివరామకృష్ణారావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మాజీ పోలీసు అధికారి గోపీనాథ్ రెడ్డిలతోపాటు ఆరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, మాజీ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో 2014లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇచ్చిన లేఖను తెలుగులోకి అనువదించి... జై గ్రేటర్ రాయలసీమ పేరున పుస్తకం రూపంలోకి తెచ్చారు. తాము అంతా వృద్ధులైనప్పటికీ... భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టినట్లు మైసూరా రెడ్డి తెలిపారు. గ్రేటర్ రాయలసీమకు చెందిన పూర్తి వివరాలు పుస్తకంలో ఉన్నాయని వివరించారు. రాయలసీమ ఉద్యమ ఫలితంగానే అనేక డిమాండ్లు నెరవేరాయని ఆయన పేర్కొన్నారు.
తాజాగా రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులు రాజకీయ నాయకుల మధ్య ఊగిసలాడుతున్నాయని నేతలు ఆరోపించారు. రాయలసీమ కోసమే పట్టిసీమ అన్నప్పటికీ.. ఇవాళ్టికి కూడా జీవో రాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరూ రాయలసీమకు చెందినవారే అయినా... ఏలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. తాము ఇప్పుడున్న రాష్ట్రంలో ఇమడలేమని... తమకు ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ కావాల్సిందేనని మైసూరా రెడ్డి ఉద్ఘాటించారు.
గ్రేటర్ రాయలసీమ సాధనకు తాను రాసిన పుస్తకం దోహదపడుతుందని భావిస్తున్నట్లు గంగుల ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు.. రాయలసీమతోపాటు బళ్లారికి చెందిన వారితో కూడా మాట్లాడానని.. ఆ రోజుల్లోనే ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేసినట్లు వెల్లడించారు. గ్రేటర్ రాయలసీమ కోసం యువత కలిసొచ్చి పోరాటం చెయ్యాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మ గౌరవం కోసమే గ్రేటర్ రాయలసీమ పోరాటమని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.
న్యాయబద్దంగా రావాల్సిన వాటిని సాధించుకోడానికే తాము పోరుబాట పట్టినట్లు నేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రులుగా చేసినవారు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారే అయినా... ఒకాయన అమరావతి అంటే.. ఇంకొకాయన విశాఖ అంటున్నారని ఆక్షేపించారు. హైకోర్టు కర్నూలుకు అంటున్నారు కానీ... ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటే రాజధాని, అన్నీ వస్తాయని... ఎక్కడికి వెళ్లవని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పట్టినంత సమయం గ్రేటర్ రాయలసీమ సాధనకు పట్టదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు