జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీస్ శాఖకు 48 స్కోచ్ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులను కైవసం చేసుకొని మొత్తం 85 అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. మహిళా రక్షణ కోసం దిశ సంబంధిత విభాగంలో అందిస్తున్న టెక్నాలజీ సేవలకు 5 అవార్డులు, కొవిడ్ సేవలకు 3 అవార్డులు లభించాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. టెక్నికల్ విభాగంలో 13, సీఐడీ 4, కమ్యూనికేషన్ 3, విజయవాడ, కర్నూలు జిల్లాకు 3 చొప్పున, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాకు 2 చొప్పున, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, కృష్ణా జిల్లాకు ఒక్కో అవార్డు దక్కాయి.
కృష్ణా జిల్లాలో ప్రారంభించిన పరివర్తన కార్యక్రమానికి గుర్తింపు లభించింది. కరోనా వేళ సమర్థంగా విధులు నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా గుర్తింపు లభించింది. కరోనా నిర్ధరణ పరీక్షలు, నమూనాల సేకరణ, ఆసుపత్రిలో పడకల వివరాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినందుకు ఆరోగ్య శాఖకు కూడా స్కోచ్ అవార్డ్ దక్కింది. విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో కరోనా నియంత్రణకు ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వలసదారులకు అందించిన సేవలకుగానూ 2 స్కోచ్ అవార్డులు దక్కాయి. కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు స్కోచ్ అవార్డు లభించింది. ఆయన ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అనే అంశానికి అవార్డు దక్కింది. కర్నూలు జిల్లాలో కోర్టు మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నందున జాతీయ స్థాయిలో స్కోచ్ వెండి పతకం లభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'