గోదావరి జిల్లాల్లో రెండేళ్ల కిందట వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి ఆహార పొట్లాలు, నిత్యావసరాల సరఫరా విధులు నిర్వహించిన మర పడవలు, లాంచీల నిర్వాహకులకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. 2020 ఆగస్టులో భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు గ్రామాలు విలవిల్లాడాయి. అప్పట్లో బాధితులకు సేవలందించిన పడవలు, లాంచీల నిర్వాహకులకు రెండేళ్లు కావస్తున్నా రూ.4 కోట్ల పైనే బకాయిలున్నాయి. తాజా వరదల నేపథ్యంలో పాత బకాయిలు చెల్లించాలని వారు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు విన్నవించినా స్పందన కనిపించలేదు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 2020లో రెండు సార్లు వరదలొచ్చాయి. ఒకసారి భారీ వర్షాలతో ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో కోనసీమ లంకలు, కాకినాడలో తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాలు.. మన్యంలో రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో 62 వేల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అప్పట్లో వారికి సహాయ చర్యలు చేపట్టినందుకు రూ.7.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. పదేపదే విన్నవించగా రూ.3.38 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.4 కోట్ల బకాయిల్లో కోనసీమ జిల్లాలో చిన్నచిన్న హోటళ్లు నడిపేవారు. బోట్ల యజమానులకే రూ.2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.
* ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గతేడాది వరదల సమయంలో సహాయ చర్యలకు ప్రభుత్వం 6 ప్రైవేటు బోట్లు, 4 లాంచీలను వినియోగించింది. 3 నెలలకు రూ.50.30 లక్షలు.. నేటికీ వాటి యజమానులకు చెల్లించలేదు.
* గతేడాది వరదల్లో కూనవరం మండలానికి చెందిన సత్యనారాయణతోపాటు మరో ఆరుగురు కలిసి సహాయ చర్యలకు నాలుగు లాంచీలు, ఒక బోటు పెట్టి, మూడు నెలలు తిప్పారు. రూ.22.32 లక్షల బిల్లు నేటికీ అందలేదు.
* 2020 వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలకు రెవెన్యూ అధికారుల సూచనతో పి.గన్నవరానికి చెందిన హోటల్ యజమాని అడ్డగళ్ల నారాయణరావు 12 వేల ఆహార పొట్లాలు అందించారు. రూ.7.20 లక్షల బిల్లుకు రూ.లక్షన్నర మాత్రమే చెల్లించారు.
ఇవీ చదవండి: