కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతంగా సాగుతోంది. తొమ్మిదోరోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్ తండ్రి కృష్ణయ్యయాదవ్‌ను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. ఇప్పటికే కృష్ణయ్య కుమారులు కిరణ్‌కుమార్ యాదవ్, సునీల్‌కుమార్ యాదవ్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. 9 రోజుల పాటు పలువురు అనుమానితులను ప్రశ్నించారు.
సీబీఐ దూకుడు..
విచారణలో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీత... తనకు, తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ.. జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను మంగళవారం కలవడం ప్రాధాన్యత సంతరించుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత హైదరాబాద్ నుంచి మూడు రోజుల కిందట పులివెందులకు వచ్చారు. రెండు రోజుల కిందట వీరిద్దరితో పులివెందులోని వారి నివాసంలో సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు సమావేశం అయ్యారు. దర్యాప్తు జరుగుతున్న తీరు, వారికున్న అనుమానాలను సీబీఐ అధికారులు నివృత్తి చేసినట్లు సమాచారం.
కీలక పరిణామాలు!
ఈ కేసులో ఏదైనా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో... వివేకా నివాసంలో ప్రస్తుతం సౌభాగ్యమ్మ, సునీత మాత్రమే పులివెందులలో ఉంటున్నారు. పులివెందులలో తమకు భద్రత కల్పించాలని ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే సునీతకు ఒక గన్‌మెన్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. బహుశా ఆమె తల్లితో పాటు అదనంగా సెక్యూరిటీ కోరి ఉంటారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. సునీత మౌఖికంగా మాత్రమే విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. లిఖితపూర్వకంగా భద్రత కోసం విజ్ఞప్తి చేస్తే... కమిటీ ద్వారా విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇదీ చదవండీ... Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు