చైనాలో విజృంభిస్తున్న కొవిడ్ -19(కరోనా) వైరస్ ప్రభావం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సౌర విద్యుత్తు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైన సౌరఫలకాలు(సోలార్ ప్యానెళ్లు) చైనా నుంచి దిగుమతి కావాలి. కొవిడ్ -19 ప్రభావంతో అక్కడ సౌర ఫలకాలు తయారు చేసే సంస్థలు మూతపడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే తయారై సిద్ధంగా ఉన్న ఫలకాల ఎగుమతికి అక్కడి పరిస్థితులు అనుకూలించడంలేదు.
ఈ పరిణామాలతో అనంతపురం, కడప జిల్లాల్లో చేపట్టిన రూ. 5100 కోట్ల విలువ చేసే 1480 మెగా వాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోయాయి. నిజానికి ఈ నిర్మాణాలు పీపీపీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తికావాలి. లేదంటే ఈ సంస్థలపై భారీ జరిమానా పడే అవకాశముంది. ఈ పరిస్థితులను వివరిస్తూ ఈ ఏడాది డిసెంబరు వరకూ ప్రాజెక్టుల నిర్మాణ గడువును పెంచాలంటూ కేంద్ర ఇంధనశాఖకు రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు.
కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే.. ప్రాజెక్టులను చెపట్టిన సంస్థలపై భారీ జరిమానా పడనుంది. పీపీఏ ఒప్పందం మేరకు నిర్దేశిత గడువు దాటితే...
- 0-30 రోజుల మధ్య ఉత్పత్తి ప్రారంభించటంలో జాప్యానికి రూ. 20 కోట్ల వరకు జరిమానా విధిస్తారు.
- 31-90 రోజుల వరకు జరిగే జాప్యానికి రు. 80 కోట్ల వరకు జరిమానా
- 90 రోజులకు మించి జాప్యం జరిగితే పీపీఏ టారిఫ్‌ను సమీక్షించే అవకాశం ఉంటుంది
2016లో అనంతపురం, కడప జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించేందుకు ఎన్టీపీసీ, సోలార్ విద్యుత్తు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్లు నిర్వహించాయి. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్, స్ర్పింగ్ ఎనర్జీ, ఆయన్ పవర్స్ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి. అనంతపురం జిల్లాలో 1,400 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే.. అందులో 700 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో 760 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌరఫలకాలు అందుబాటులో లేక ఈ మూడు సంస్థలు ఇబ్బందుల్లోపడ్డాయి
ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్: చైనాపై బిగుస్తున్న మన 'పట్టు'