Red sandal smugglers in seshachalam forest: ప్రపంచంలోనే అరుదైన ఎర్రబంగారం (ఎర్రచందనం) కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో లభ్యమవుతోంది. సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగానే ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. దశాబ్దాల తరబడి అక్రమ రవాణా సాగుతున్నా.. పోలీసు, అటవీశాఖలు పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వెరసి అరుదైన ఎర్ర బంగారం విదేశాలకు తరలిపోతోంది. ఎర్రచందనం రవాణా ఇతివృత్తంగా తెరకెక్కించిన ఓ సినిమా ఇటీవల విడుదలైంది.
- ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయంగా మంచి డిమాండు ఉండటంతో బడా స్మగ్లర్లు వాటిని విదేశాలకు తరలించడానికి ఎంతటికైనా తెగపడుతున్నారు. జిల్లాలో ఎర్రచందనం చెట్లను నరికి వాటిని లారీల్లోకి తరలించాలంటే తమిళ కూలీలదే ముఖ్య భూమిక. ప్రధానంగా రైల్వేకోడూరు శేషాచల అడువుల్లోకి పోలీసుల కళ్లు గప్పి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, నందలూరు, రాజంపేట, సిద్దవటం అటవీ ప్రాంతాల్లోకి చెట్లను నరకడానికి వస్తున్నారు. వారం, పది రోజులపాటు అడవిలోనే ఉండి మేలు రకం చెట్లను నరికి దుంగలుగా మార్చి లారీల్లో తరలిస్తున్నారు.
- జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి అక్కడ నుంచి విదేశాలకు యథేచ్చగా ఎర్రచందనం తరలిపోతోంది. బెంగళూరు సమీపంలోని కటిగెనహళ్లి ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు ముంబయి మీదుగా విదేశాలకు చేరవేస్తున్నట్లు పోలీసు అధికారుల పరిశీలనలో తేలింది. చాలా సందర్భాల్లో పోలీసులు కటిగెనహళ్లి, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది స్మగ్లర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. ఇలా పట్టుబడినవారిలో 80 శాతం మంది తమిళ కూలీలే. చెన్నై, బెంగళూరు, ముంబయి, దుబాయి ప్రాంతాల్లో ఉంటున్న బడా స్మగ్లర్లు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం టన్ను ధర రూ.కోటి పలుకుతోంది. గతంలో ప్రభుత్వం ఈ-వేలం ద్వారా విక్రయించిన సందర్భాల్లోనూ అదే ధర పలకడం గమనార్హం.
- తమిళనాడు నుంచి కూలీలను జిల్లాలోని అటవీ ప్రాంతాలకు తరలించేది అంతా మేస్త్రీలే. వీరికి వారం నుంచి పది రోజులకు రూ.లక్షల్లో ముడుతుండడంతో కూలీలు కూడా ప్రాణాలకు తెగిస్తున్నారు. పోలీసులు దాడులు చేసిన సమయంలో వారిపైకి రాళ్లు, గొడ్డళ్లతో దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు. పోలీసులకు కూలీలు చిక్కినా వారి కుటుంబాలకు డబ్బులు చేరుతుండడంతో చెట్లు నరకడానికి వెనకాడటం లేదు. పోలీసు, అటవీశాఖలు మరింత నిఘా ఉంచి బడా స్మగర్లను పట్టుకుంటేనే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.
ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు అరెస్టు
Red sandal smugglers arrested: కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద ఎర్రచందనం దుంగలను అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 50 లక్షల రూపాయల విలువ చేసే అర టన్ను ఎర్రచందనం దుంగలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ వివరించారు. అడవిలోకి ఎర్రచందనం చెట్లను నరకడానికి వెళ్తున్న క్రమంలో స్మగ్లర్లను పట్టుకున్నామని.. మరో 9 మంది పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు.
22 మందిపై పీడీ యాక్టు నమోదు
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ముమ్మరంగా దాడులు చేస్తున్నాం. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేయడమే కాకుండా తనిఖీ కేంద్రాల్లో సోదాలు సాగిస్తున్నాం. ఈ ఏడాదిలోనే చాలామంది స్మగ్లర్లను పట్టుకున్నాం. 22 మందిపై పీడీ యాక్టు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తున్నాం. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో బడా స్మగ్లర్లపై నిఘా పెడుతున్నాం. - అన్బురాజన్, జిల్లా ఎస్పీ
ఇదీ చదవండి..