Rajampet District: రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎలాగైనా పాదయాత్ర చేయాలని జేఏసీ పట్టుబట్టగా.. పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో తోపులాటలు, వాగ్వాదాలు, అరెస్టులు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా వెంకట రాజంపేట నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు తమ డిమాండ్ స్వయంగా విన్నవించుకోవాలని జేఏసీ భావించింది. అయితే.. పాదయాత్ర చేయడానికి వచ్చిన అఖిలపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అరెస్టుల పర్వం మధ్యాహ్నం వరకు సాగింది. భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, సీపీఐ నాయకుడు మహేష్, తేదేపా నాయకుడు నరసింహను పోలీసు బలగాలు బలవంతంగా ఈడ్చుకొనిపోయి వాహనాల్లోకి ఎక్కించారు. ఒకానొక దశలో చొక్కాలు కూడా చినిగిపోయాయి. జేఏసీ నాయకులు వాహనాలకు అడ్డుపడినా వారిని చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు.
పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడును పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ తాను వాహనం ఎక్కకుండా నడుచుకుంటూ వస్తానంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చేసేదిలేక పోలీసుల పర్యవేక్షణలో ఆయన పాదయాత్ర పట్టణ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అక్కడి నుంచి మన్నూరు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో మన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పోలీస్ స్టేషన్ బయట ఉన్న వ్యక్తులు పాదయాత్రగా కడపకి బయలుదేరారు. అయితే పోలీసులు వెంబడించి వారిని కూడా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల శంకర్ రెడ్డి మాట్లాడుతూ... రాజంపేట జిల్లా కేంద్రం కోసం ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 3వ తేదీ వరకు గడువు ఉందని ఆ లోపు మా సమస్యను చెప్పుకోవడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డగించడం దారుణమన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతి ర్యాలీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దానిని పోలీసులు భగ్నం చేస్తున్నారని.. అరెస్టులు చేసి చితకబాదుతున్నారని ధ్వజ మెత్తారు.
ఇదీ చదవండి:
Students Problems: అక్కడ పిల్లలు.. ఇక్కడ తల్లిదండ్రులు.. ఏం జరుగుతుందోనని టెన్షన్