Children death knell in Kadapa: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిశువుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. మూడ్రోజుల వ్యవధిలో నలుగురు పురిటిబిడ్డలు మృతి చెందడం తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. గత రెండ్రోజుల్లో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోగా... ఆదివారం మరో బిడ్డు చనిపోవండంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Children death knell in Kadapa: వైయస్‌ఆర్ జిల్లా అట్లూరు మండలం కంభగిరి గ్రామానికి చెందిన ప్రభావతి నెలలు నిండక ముందే ప్రసవించింది. బిడ్డ బరువు తక్కువగా ఉందని సర్వజన ఆసుపత్రికి తీసుకురాగా పరిశీలించిన వైద్యులు వైద్యం అందించారు. గత మూడు రోజులుగా వైద్య సేవలు అందించిన వైద్యులు.. మొదట ఎలాంటి ఇబ్బంది లేదన్నారని, ఇప్పుడు చనిపోయిందని చెప్పారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పొంతన లేని సమాధానాలు చెబుతూ చనిపోయిన బిడ్డను మా చేతిలో పెట్టారని రోదించారు. అధికారికంగా నలుగురు మృతి చెందినట్లు చెబుతున్నా... ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలోకి ఇతరులెవరినీ అనుమతించకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపం లేదని తెలిపారు. నిత్యం కలెక్టరు విజయరామరాజు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు.
సంబంధిత కథనం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కలకలం.. రెండు రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి