మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత శివశంకర్‌రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతించడంతో ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని ఈ ఉదయం కడపకు తీసుకువచ్చారు. కడప రిమ్స్‌లో శివశంకర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ (డిసెంబర్ 2వ తేదీ వరకు) విధించారు.
కోర్టు వద్దకు ఎంపీ అవినాష్..
శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు పులివెందుల కోర్టు వద్దకు వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చారు. పులివెందుల కోర్టు వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
మా నాన్నకు సంబంధం లేదు..
మరోవైపు న్యాయం చేయాలని కోరుతూ సీబీఐకి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖ రాశారు. ‘‘వివేకా హత్య కేసులో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆరోపణలతోనే మా నాన్నను అరెస్టు చేశారు. ఈ నెల 15న ఆయన ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నందున న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి’’ అని చైతన్యరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
సీబీఐ డైరెక్టర్‌కు శివశంకర్ రెడ్డి లేఖ...
మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. నిన్న హైదరాబాద్‌లో శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు... ఇవాళ ఉదయం కడపకు తీసుకొచ్చారు. దేవిరెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పరిచారు. అయితే వివేకా కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని... కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించే కుట్ర పన్నారని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో సిట్, సీబీఐ అధికారులు పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరై సహకరించినట్లు తెలిపారు.
దర్యాప్తు సమయంలో వివేకా కుమార్తె సునీత.. పలుమార్లు అధికారులతో సమావేశమవుతూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు ఇస్తున్నారని శివశంకర్‌రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని, లేకుంటే అసలు నిందితులు తప్పించుకుని అమాయకులు దోషులుగా తేలే ప్రమాదం ఉందని విజ్ఞప్తి చేశారు. వివేకా ఫోన్ లోని డేటాను టాంపర్ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగిరికి ఐదు రోజుల్లోనే ముందస్తు బెయిలు ఎలా మంజూరైందని ప్రశ్నించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి కూడా తన తండ్రికి కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు.
వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన...
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు(YS.Viveka murder case)లో సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(Shiva Shankar Reddy) ని బుధవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆయన కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy)కి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి(Dhastagiri) ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆయన్ను కడప తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టింది. గురువారం ఆయన్ను పులివెందులకు తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచనుంది. అయితే సీబీఐ వర్గాలు అధికారికంగా వివరాలేమీ ప్రకటించలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.