కడప జిల్లా మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి వేధిస్తున్నారని... ఓ మైనారిటీ కుటుంబం పోస్ట్ చేసిన వీడియోపై కడప ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. ఎస్పీ కార్యాలయానికి బాధిత అక్బర్ బాషా కుటుంబాన్ని, కడప వైకాపా నాయకులను పిలిపించుకుని మాట్లాడారు. అక్బర్ బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20గంటలకు స్పందించామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నామన్నారు. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో బాషా ఇచ్చిన పిటిషన్పై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని వెల్లడించారు. మైదుకూరు సీఐ కొండారెడ్డిని రెండు రోజుల పాటు విధుల నుంచి తప్పించినట్లు వివరించారు. భూ సమస్య పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చినట్లు ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.
అక్బర్ బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గం.కు స్పందించాం. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో బాషా పిటిషన్ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాం. సీఐ కొండారెడ్డిని 2 రోజులపాటు విధుల నుంచి తప్పించాం.
- ఎస్పీ అన్బురాజన్, కడప జిల్లా
సీఐ వేధిస్తున్నాడంటూ... తాను పోస్ట్ చేసిన వీడియోపై జిల్లా ఎస్పీ స్పందించి, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని బాధితుడు అక్బర్ బాషా తెలిపారు. తన సమస్యపై సీఎం కార్యాలయం కూడా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుందని వెల్లడించారు. 2009లోనే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్న అక్బర్ బాషా... వైకాపా నేత తిరుపాల్‌రెడ్డి కుటుంబం భూమి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు అనుకూలంగా సీఐ కొండారెడ్డి వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై స్పందించిన ఎస్పీ.. సీఎంవో ఆదేశాల మేరకు వారంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఐ. కొండారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వివరించారు.
సీఎంవో ఆదేశాల మేరకు వారంలో సమస్య పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నా సమస్యపై సీఎం కార్యాలయం కూడా ఎస్పీకి ఫోన్ చేసి ఆరా తీసింది. 2009లోనే భూమిని మా కుటుంబం రిజిస్ట్రేషన్ చేసుకుంది. వైకాపా నేత తిరుపాల్‌రెడ్డి కుటుంబం భూమి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సీఐ కొండారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
- అక్బర్ బాషా, బాధితుడు
ఏం జరిగిందంటే...
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.
దువ్వూరు మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తమ కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు మైదుకూరు రూరల్ సీఐకి తమ సమస్యను వివరించారు. తన సమస్యను పరిష్కరించకుండా వైకాపా నేతకు అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించారు. సీఐ కొండారెడ్డి, వైకాపా నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. తన సమస్యపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అనుబంధ కథనాలు