Guntur district students in Ukraine: ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణానికి అక్కడి తెలుగు విద్యార్ధులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన లిఖితా బాయి, రాధిక ఉక్రెయిన్‌లోని నేషనల్ మెడికల్ యూనిర్శిటీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నారు. రెండు రోజుల నుంచి పరిస్థితి దారుణంగా ఉందని, బయటకు వెళ్లలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తమను సొంతూళ్లకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి దారుణంగా ఉంది
ఉదయం 3 గంటల నుంచి కొద్దిగా ఆహారం, కొంచె తాగు నీరు ఉన్నాయి.. ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. నీళ్ల రావడం లేదు. పవర్ కూడా కట్ అవుతుందని చెబుతున్నారు. మమ్మల్ని మెట్రో స్టేషన్లలోని బేస్మెంట్లలో ఉండమన్నారు. అక్కడికి వెళ్లే సరికి ఉక్రెయిన్యన్లు మొత్తం ఆక్రమించారు. కూర్చోవడానికి కూడా స్థలం లేక ఎంట్రెన్స్‌లో కూర్చున్నాం. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కనీసం బెడ్షీట్లు కూడా తెచ్చుకోలేదు. కేవలం డాక్యుమెంట్లతో వచ్చేశాం.. చాలా ఇబ్బంది పడుతున్నాం.. ప్రధాని మోదీ స్పందించి మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి. -రాధిక, తెలుగు విద్యార్ధిని
నెట్వర్క్ ఉండడం లేదు..
ఇళ్లలో ఉన్న మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం. మెట్రో స్టేషన్లలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. మొబైల్ నెట్వర్క్ ఉండడం లేదు.. ఇక్కడి నుంచి అమ్మానాన్నలకు సమాచారం ఇవ్వలేకపోతున్నాం.కేవలం డాక్యుమెంట్లతో బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇండియన్ ఎంబసీ వారు త్వరగా స్పందించాలి. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి. -లిఖితా బాయి, తెలుగు విద్యార్ధిని
ఇదీ చదవండి:
'కీవ్'లోకి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ హస్తగతమైనట్లేనా?
తెలంగాణ విద్యార్థులను భారత్‌కు రప్పించండి.. ఖర్చులు మేమే భరిస్తాం'