గుంటూరు జిల్లాలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్లాస్మా థెరపీని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. రెడ్‌క్రాస్ సంస్థలో ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని బ్లడ్ బ్యాంకులు ప్లాస్మా సేకరించవచ్చని... అయితే ప్లాస్మా చికిత్స ఎవరికి ఇవ్వాలనేది మాత్రం జిల్లాస్థాయి నైతిక కమిటీ మాత్రమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ కమిటీ ఛైర్మన్‌గా వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించనున్నారు. మరికొందరు సభ్యులుగా ఉండి ప్లాస్మా ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తారు.
కొవిడ్ వచ్చి కోలుకున్న తర్వాత... 28 నుంచి 60వ రోజు వరకూ ప్లాస్మా దానం చేయవచ్చు. 18నుంచి 50 ఏళ్లలోపు వయసుండి... ఎలాంటి అనారోగ్యం లేనివారు ఇవ్వొచ్చన్నారు. జిల్లాలో కరోనా కారణంగా ఒక్క జులై నెలలోనే 174మంది మరణించారని పాలనాధికారి తెలిపారు. కోవిడ్ కారణంగా సంభవించే మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్లాస్మా చికిత్స ఉపయోగపడుతుందని... అందుకే ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్లాస్మా దానం చేశారు. కోవిడ్ విజేతలు వీలైనంత ఎక్కువ మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ... రాయలసీమ ఎత్తిపోతల పథకం... వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు