కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు విద్యార్థులు కిర్గిస్థాన్ దేశంలో చిక్కుకుపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు కరోనా కారణంగా అక్కడే ఉండిపోయారు. కిర్గిస్థాన్ లోని 4 వైద్య కళాశాలల్లో వీరంతా చదువుతున్నారు. ఏపీ, తెలంగాణా నుంచి రెండు వేల మందికి పైగా ఉన్నట్లు వారు ఈటీవీ భారత్‌కు తెలిపారు.
వందే భారత్ కింద కేంద్ర ప్రభుత్వం విమానాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడిచాయని వారు చెప్పారు. అందులో నాలుగైదు వందల మించి వెళ్లలేకపోయామన్నారు. మిగతా వేలాది మంది విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు వివరించారు. విమానాలు ఏర్పాటు చేయాలని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వాలనే అడగాలని వారు చెప్పారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు ఛార్టెడ్ విమానాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని... అయితే ఎంబసీ నుంచి అందుకు అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిపి దాదాపు 6వేల మంది కిర్గిస్థాన్‌లో ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
కరోనా ఎఫెక్ట్: అక్షరాలు నేర్పిన గురువే...అరటిపండ్లు అమ్ముతూ..!