Capital Farmers Maha Padayatra: రాజధాని రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరు సీపీఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అందరూ ఆమోదించిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతుల మహా పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుందని... ఇందుకు వైకాపా తప్ప అన్నిపార్టీలు సంఘీభావం తెలుపుతున్నట్లు వెల్లడించారు. సమావేశానికి వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెదేపా తరఫున దామచర్ల శ్రీనివాసరావు, అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర కన్వీనర్ మల్లికార్జునరావు, సీపీఎం తరఫున పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి రైతుల పాదయాత్రపై వైకాపా మంత్రులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే విశాఖ నగర అభివృద్ధికి కారణమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేలా మంత్రులు, ఎంపీలు చర్యలు తీసుకోవాలన్నారు. పోర్టులు అన్ని అదానీకి కట్టబెడుతూ... విశాఖ నగరాన్ని వైకాపా నాయకులే విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లు గడిచినా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. లేపాక్షి భూములు తీసుకున్నది, బ్యాంకులలో తనఖా పెట్టి దివాళా తీయించి, తిరిగి ముఖ్యమంత్రి జగన్ కుటుంబసభ్యులే ఆ భూముల్ని కొంటున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి లేపాక్షి భూములను ఏ నిమిత్తం తీసుకున్నారో అది సాధ్యపడనప్పుడు ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వలన్నారు.సెప్టెంబర్ నెలాఖరులోగా భూములు తిరిగి ఇవ్వకుంటే రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: