ఉల్లిపాయల కోసం రైతుబజార్ల వద్ద రద్దీ తగ్గించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని రైతుబజార్లతోపాటు మార్కెట్ యార్డుల్లోనూ ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్కెట్ యార్డుల వద్ద ఉల్లిపాయల విక్రయాలకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ మార్గదర్శకాలు జారీచేశారు. అందుబాటులో ఉన్న సరకుని రైతుబజార్లకు, మార్కెట్ యార్డులకు పంపాలని ఆదేశించారు.
రైతుబజార్లున్న నగరాల్లో మాత్రం మార్కెట్ యార్డుల్లో పంపిణీ చేయరు. డ్వాక్రాగ్రూపుల ద్వారా ఉల్లి విక్రయాలు జరిపేలా సంబంధిత మార్కెట్ కార్యదర్శులు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకే క్యూలైన్ ఉంటే రద్దీ పెరుగుతుందని... వరుసలు పెంచాలని నిర్ణయించింది. సరకు రాక, అమ్మకాలకు సంబంధించి రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. విక్రయాల ద్వారా వచ్చిన నగదు ఏరోజుకారోజు బ్యాంకుల్లో జమచేయాలని అధికారుల్ని ఆదేశించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో... ప్రభుత్వం 25 రూపాయలకే కిలో ఎర్రగడ్డలను పంపిణీ చేస్తోంది. విషయం తెలుసుకున్న ప్రజలు పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వచ్చారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలు చేపట్టారు. మొదటిరోజు 1500 కిలోల ఎర్రగడ్డలను విక్రయించడానికి చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు, నగరి మార్కెట్ యార్డుల్లో రాయితీ ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. పుత్తూరు మార్కెట్ యార్డుకు 1520 కేజీలు పంపినట్లు సూపర్వైజర్ లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు రూ.25 చొప్పున ఒక్కొక్కరికి కేజీ అందజేస్తున్నట్లు వివరించారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండీ...